Iహ్హాహ్హా...ఐఏఎస్ లు!!
@@@
లక్షలమంది ఆ సర్వీస్ లో చేరాలని స్వప్నిస్తుంటారు. కానీ ఏ పదిమందికో పదిహేను మందికో ఆ అదృష్టం దక్కుతుంది. వయసు పాతిక కూడా ఉండదు. జిల్లా మొత్తానికి సర్వాధికారి. సీనియర్ అధికారులు, ఉద్యోగులు కూడా ఆ పాతికేళ్ల కుర్రాడి ముందుకు వెళ్తే రెండు చేతులు జోడించి నమస్కరించాల్సిందే. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే అధిపతి. అలాంటి ఏడెనిమిదిమంది ఎమ్మెల్యేలకు ఆ పాతికేళ్ల కుర్రాడు అధిపతి! ఐఏఎస్ కావాలంటే ఎన్నెన్నో అడ్డంకులను అధిగమించాలి. ఎన్నెన్నో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్వ్యూలు, రాతపరీక్షలు...వైకుంఠవాసుని దర్శనం కావాలంటే సప్తద్వారాలను ఎలా దాటాలో, ఐఏఎస్ అనిపించుకోవాలంటే అంతకు మించి ప్రయాణించాలి. ఇక ఆ ఐఏఎస్ చీఫ్ సెక్రెటరీ అయ్యారంటే రాష్ట్రంలోని అయిదారు లక్షలమంది ఉద్యోగులకు బాస్ అనిపించుకుంటాడు. అతని మాట శిలాశాసనం.
ఇక ఐఏఎస్ అనగానే అతను సర్వజ్ఞుడని, సకలకళావల్లభుడని, అతని జ్ఞానం, విషయపరిజ్ఞానం సాగర సమానమని, అనేక రంగాల్లో ప్రవేశం కలిగి ఉంటాడని, నాలుగైదు భాషలను అనర్గళంగా మాట్లాడే శక్తిని కలిగిఉంటాడని ఇన్నాళ్లూ నాకో అభిప్రాయం ఉండేది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ లకు నాలెడ్జ్ ఉండదని, విషయం పరిజ్ఞానం ఉండదని కుండబద్దలు కొట్టి నా కళ్ళు తెరిపించాడు! అంతే కాదు...స్టైరిన్ అనే విషవాయువు గూర్చి తనకే తెలియదని, ఇక ఐఏఎస్ లకు ఏమి తెలుస్తుందని మరో సత్యాన్ని దర్శింపజేశారు. "మహాభారతం లో ఉన్నవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. మహాభాతంలో లేనివేవీ ఈ ప్రపంచంలో లేవు" అని మహాభారతం గూర్చి ఒక ప్రాశస్త్యం ఉన్నది. అలాగే ప్రపంచంలో ఉన్నవన్నీ చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబుకు తెలియనివి ఏవీ ఈ ప్రపంచంలో లేవు." అని ఇకనుంచి చంద్రస్త్రోత్రం చేసుకోవాలి.
చాలాకాలం క్రితం ఒక పత్రికలో చదివేను. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి మీద కోపంతో చేతిలోని ఫైల్ ను విసిరేస్తే...ఆయన కోపించి "నేను తలచుకుంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరి ముఖ్యమంత్రిని కాగలను...మీరు ఈ జన్మలో ప్రభుత్వంలో అటెండర్ కూడా కాలేరు" అని హెచ్చరించాడట!
ఏవీ అలనాటి ఐఏఎస్ ధీరులు? చంద్రబాబు తమను అంత దారుణంగా విమర్శించినా, చచ్చు పీనుగుల్లా పడిఉన్నారు ఐఏఎస్ అధికారులు! సిగ్గుచేటు!!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
(ఈ వ్యాసం www.jaihojagan.com కోసం వ్రాయబడినది. ఫౌండర్:: శ్రీ దేవరకొండ రామభాస్కర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ)
No comments:
Post a Comment